రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామునఆయన స్వామివారి నిజపాద సేవలో పాల్గొన్నారు. తితిదే ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ముకేశ్‌కు వేదాశీర్వచనం పలికారు. తర్వాత ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం అంబానీ.. స్థానిక ఏనుగు, గోశాల వద్దకు వెళ్లి పరిశీలించారు. గజరాజల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి ఏడాదికి తిరుమల ఆలయం మరింత అభివృద్ధి చెందుతోందని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ముకేశ్ అంబానీ అన్నారు.
మరోవైపు తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాదిలో జరిగే టోర్నమెంట్స్‌లో బాగా ఆడాలని కోరుకున్నానన్నారు.