అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లు అర్జంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. జగన్ అధికారంలో కొచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్న క్యాంటీన్లని మూసేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అన్న క్యాంటీన్లకు తాళాలేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే మార్గం లేకుండా పోయిందని, చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారన్నారు. అన్న క్యాంటీన్ల కోసం బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించామని, జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారన్నారు.
అన్న క్యాంటీన్లను మూసేసే కుట్ర జరుగుతోందని మేము అడిగితే, లేదని సమాధానం ఇచ్చిన మీ ప్రభుత్వం ఆ తరువాతి రోజే అన్న క్యాంటీన్లని మూసేసిందని, రోజుకి 3 లక్షల మందికి ఆకలి మిగిల్చిందని ఆయన మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు పనుల్లేవు.. కార్మికులకి ఉపాధి దొరకడంలేదు.. యాచకులు ఆకలితో నకనకలాడుతున్నారని, పేదల ఆకలి తీర్చాలని టీడీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను నడుపుతున్నామన్నారు.