ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న విపక్షం.. ఇందులో భాగంగా టార్గెట్ అవుతున్న నేతలకు అభయమిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నారా లోకేశ్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తుండటంతో కడప విమానాశ్రయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన కడప సెంట్రల్ జైలుకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ప్రవీణ్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్ తో పాటు మరో 17 మంది నేతలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మరోవైపు, నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కడప చేరుకున్న నారా లోకేశ్ జిల్లా ముఖ్య నేతలు, ఇంఛార్జులతో భేటీ అయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. అనంతరం విమానాశ్రయం నుండి కడప సెంట్రల్ జైలుకి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ని లోకేష్ పరామర్శించనున్నారు. అనంతరం పార్టీ నేతలతో మరోసారి భేటీ కానున్నారు. దీంతో లోకేశ్ టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు పెంచారు.