మరోసారి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ఓ సెటైరికల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. సీఎం హోదాలో విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును అసెంబ్లీ వేదికగా వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా జగన్ మార్చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనను విడుదల చేసింది.
వరుసగా జరిగిన ఈ రెండు కీలక పరిణామాలను ప్రస్తావిస్తూ జగన్‌పై సెటైర్ సంధించారు నారా లోకేశ్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యకుడు కాకుండా పోయాడు అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండూ ఒకే రోజు జరిగాయని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జగన్ భవిష్యత్తు ఏమిటోననని కూడా లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. తన ట్వీట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి రాసిన లేఖ ప్రతిని కూడా జత చేశారు నారా లోకేశ్.