దేశచరిత్రలో 48 ఏళ్ల తర్వాత ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా నామినేషన్ వేయగా, లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి ఎంపీ కె. సురేశ్‌ను బరిలోకి దింపింది. ఆయన కూడా మంగళవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. 1976 తర్వాత ప్రతిసారి ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరగగా ఈసారి మాత్రం ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది.
ఈ ఎన్నిక సందర్భంగా ఇద్దరు అభ్యర్థులు ఓం బిర్లాకు (ఎన్డీఏ కూటమి), కె సురేశ్‌కు (ఇండియా కూటమి) పోల్ అయ్యే ఓట్ల లెక్కింపునకు విపక్షాలు సభలో పట్టుబట్టే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈసారికి ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే వ్యవస్థ ద్వారా ఓటింగ్ నిర్వహించే దాఖలాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు. ఈసారికి స్పీకర్ ఎన్నికకు పేపర్ స్లిప్పుల ద్వారా ఓట్లు వేసే పద్ధతినే వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.