సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది సొంతూళ్లకు బయల్దేరతారు. లేదా ఏదైనా వెకేషన్కు వెళ్లాలనుకుంటారు. కాస్త డబ్బున్నవారైతే విమానాల్లో ప్రయాణిస్తారు. అదే మధ్య తరగతి వాళ్లైతే వెకేషన్ కూడా తమ బడ్జెట్లో ప్లాన్ చేస్తారు. అందుకే వారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఇలా సమ్మర్లో ప్రయాణాలు పెట్టుకునే వారి కోసమే రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది . అదేంటంటే..?
వేసవి సీజనులో రద్దీని తట్టుకునేలా 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలోని పట్నా, దిల్లీ, విశాఖపట్నం, ముంబయి వంటి ప్రధాన కేంద్రాల మీదుగా ఈ రైళ్లను 6,369 ట్రిప్పులు నడపనున్నారు. గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో మొత్తం కలిపి 4,599 ట్రిప్పులను రైల్వేశాఖ నడిపింది. ఈ ఏడాది అంతకంటే 1,770 ట్రిప్పులు అదనంగా నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పట్నా – సికింద్రాబాద్a, పట్నా – యశ్వంత్‌పుర్, విశాఖపట్నం – పూరి – హావ్‌డా తదితర మార్గాల్లో తిరుగుతాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతేడాది కంటే 80 ట్రిప్పులు అదనంగా 784 ట్రిప్పుల మేర ప్రత్యేకరైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.