ఉత్తర భారత ప్రజలను వేడి గాలులు అల్లాడిస్తున్నాయి. దిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, బిహార్‌లో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేడి గాలులకు తట్టుకోలేక పలు రాష్టాల్లో గడిచిన 24 గంటల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దిల్లీలో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
బిహార్లో ఎండ వేడిమికి 24 గంటల్లో 26 మంది మరణించారు. అందులో ఒక ఏఎస్‌ఐ, ఎన్నికల విధుల్లో ఉన్న సైనికుడు కూడా ఉన్నారు. ఝార్ఖండ్లోని పలామూలో వేడి గాలులు తట్టుకోలేక 8 మంది మరణించారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రవుర్కెలా ప్రభుత్వాసుపత్రిలో అదే జిల్లాకు చెందిన 10 మంది, సుందర్‌గఢ్ ఆస్పత్రిలో మరో ఆరుగురు మృతి చెందారు. బాధితుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించిన వైద్యులు మృతికి కారణం వడదెబ్బేనని ప్రాథమికంగా తేల్చినా పోస్టుమార్టం నివేదికలు వస్తేనే మరింత స్పష్టత ఇవ్వగలమని ప్రకటించారు. ఎండలు భగభగమంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత ఎక్కువ నీరు తాగాలని పాలము వైద్యనిపుణులు సూచిస్తున్నారు.