దోమల నివారణకు దిల్లీ అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఏకంగా ఓ స్పెషల్ రైలునే ఏర్పాటు చేసింది దిల్లీ రైల్వే డివిజన్. ‘మస్కిటో టర్మినేటర్ ఆన్ వీల్స్’ పేరుతో ఈ ప్రత్యేక రైలు ట్రాకుల వెంబడి పరుగులు పెట్టినట్లు తెలిపింది.
మున్సిపల్ కార్పొరేషన్ వ్యాగన్‌పై సమకూర్చిన ప్రత్యేక పరికరం ‘డీబీకేఎం’.. రైలు కదులుతున్న సమయంలో ట్రాక్‌లతోపాటు 50 నుంచి 60 మీటర్ల దూరం వరకూ దోమల నివారణ మందును పిచికారీ చేస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు రథ్‌ధానా నుంచి ఆదర్శనగర్ మీదుగా బాడ్లీ వరకు వెళ్లి మళ్లీ న్యూదిల్లీకి తిరిగి చేరుకుంటుందని వెల్లడించారు.దోమల నియంత్రణే లక్ష్యంగా సెప్టెంబర్ 21 వరకు ఈ ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు చెప్పారు.
ఈ సీజన్‌లో పెరిగే దోమల లార్వాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా సమస్య ఉన్న ప్రదేశాల్లో రెండు రౌండ్లు చుట్టేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.