.యూపీలో నైమిశారణ్యం అభివృద్ధికి శ్రీకారం
.త్వరలో ఏర్పాటు కానున్న వేద విజ్ఞాన కేంద్రం
.ఎలక్ర్టిక్ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు
పవిత్ర గోమతీ నదీ ప్రవాహంతో పరమ పావనమైన క్షేత్రం నైమిశారణ్యం. నిరంతర యజ్ఞాల వలన యజ్ఞభూమిగా ప్రసిద్ధిపొందిన పుణ్యస్థలం. సమస్త పురాణాలకు పుట్టినిళ్ళుగా భాసిల్లిన ప్రాంతమది. 88 వేల మంది మహర్షులు తపస్సు చేసిన పవిత్ర నైమిశారణ్యం దేశంలోని ప్రధాన మతపరమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి చక్కని తార్కాణంగా భాసిల్లుతున్న నైమిశారణ్యంలో త్వరలోనే వేద విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇటీవల నైమిశారణ్య ధామ తీర్థ వికాస్ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.అంతేకాదు లక్నో-సీతాపూర్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఇందుకోసం సర్వే కూడా పూర్తయింది.పర్యాటకుల సౌకర్యార్థం నైమిశారణ్యంలో టూరిస్ట్ల భద్రత కోసం పోలీసులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నైమిశారణ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కింద జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నైమిశారణ్య సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి అన్నారు.నైమిశారణ్య ధామం, సమీపంలోని పర్యాటక స్థలాల పునరుద్ధరణ,సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు యోగీ. ఋషుల తప్పస్సు చేసిన ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.వేద విజ్ఞాన్ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత వేదాలు, పురాణాల్లో నిక్షిప్తమైన జ్ఞానాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.ఖగోళ శాస్త్ర విద్యార్థుల కోసం ఇక్కడ అబ్జర్వేటరీని కూడా ఏర్పాటు చేయనున్నారు. స్వదేశ్ దర్శన్-2లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నైమిశారణ్యంను ఎంపిక చేసిందన్నారు. అన్యమత ప్రచారాలను పూర్తిగా నివారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
నైమిశారణ్యంలోని శ్రీలలితాదేవి ఆలయంలో పర్యాటకులు మరియు భక్తుల సౌకర్యార్థం కారిడార్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను త్వరితగతిన సిద్ధం చేసి ఆమోదం తీసుకున్న తర్వాత పనులు ప్రారంభించాలన్నారు.లలితా దేవి ఆలయంలో కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదన కోరారు. నైమిశారణ్యలో ఉన్న లలితా దేవి ఆలయం వద్ద ప్రవేశ మార్గాన్ని గ్రాండ్‌గా మార్చాలని యోగీ సూచించారు. పంచముఖి ప్లాజా నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్ట్ కింద, నైమిశారణ్య-మిశ్రిఖ్‌లోని చక్రతీర్థం యొక్క ప్రధాన ద్వారాలు మరియు ఇతర గేట్‌లను కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నామని స్పష్టం చేశారు.