హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ సంస్థ అతలాకుతలం అవుతోంది. దీని ప్రభావం మార్కెట్ పై తీవ్రంగా పడుతోంది. అదానీ గ్రూప్ సంస్థల వాటాలు స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి చవిచూస్తున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ తరఫున తీసుకొచ్చిన ఎఫ్‌పీఓను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదానీ.. తమ సంస్థ మూలాలు బలంగానే ఉన్నాయని స్వయంగా ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ సహా దాదాపు అన్ని కంపెనీలు గురువారం భారీ నష్టాలు చవిచూశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏకంగా 26శాతానికిపైగా పతనమైంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ సంస్థలు ₹8 లక్షల కోట్లు నష్టపోయాయి.ఎఫ్‌పీఓను వెనక్కు తీసుకోవడం.. ఈ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించింది. అదానీ విల్‌మార్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా అదానీ గ్రూప్ సంస్థల సంపద రూ.8లక్షల కోట్లకుపైగా ఆవిరైనట్లు తెలుస్తోంది.