హజ్ కోటాపై భారత్-సౌదీ అరేబియా మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో భారత్ తరఫున మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్.. సౌదీ తరఫున హజ్ మినిస్టర్ డాక్టర్ తౌఫిగ్ అల్ రబియా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా 2024 సంవత్సరానికిగాను భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించనుంది. 1,40,020 సీట్లు హజ్ కమిటీ ద్వారా వెళ్లే వారికి కేటాయించనున్నారు. 35,005 సీట్లు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే వారికి ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు జెడ్డాలోని అబ్దులజీజ్ ఎయిర్ పోర్టులోని హజ్ టెర్మినల్‌ను సందర్శించారు.
హజ్, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భారతీయుల కోసం సత్వర వీసా పరిష్కారం, అదనపు విమానాలు, రవాణాపరమైన సౌలభ్యం వంటి చర్యలు తీసుకొన్నట్లు ఇటీవల సౌదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్రా వీసాను 90 రోజులకు పొడిగించడం, పెరుగుతున్న భారత యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నాలుగు రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ వంటి చర్యలు తీసుకుంది సౌదీ సర్కార్.