గత వారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని ఆగంతకులు ఇద్దరు లోక్సభలో ప్రవేశించి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అలజడి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై విచారణకు లోక్సభ స్పీకర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు 50 పోలీసు బృందాలు నిందితుల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాయి.
అరెస్టయిన నిందితులంతా చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర యోధుల పేర్లతో ఏర్పడిన ఆరు వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరు స్వాతంత్య్ర సమర యోధుల ఆలోచనలు, ఆదర్శాల గురించి చర్చించుకుంటారని, వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.
“బ్రిటిష్ పాలకుల చట్టాలను నిరసిస్తూ పార్లమెంటులో పొగ బాంబు వేసిన భగత్ సింగ్ చర్యను పునరావృతం చేయాలనుకున్నారు. అందుకేఆరుగురు నిందితులు లోక్సభలో ఆ ఘటనకు విఫలయత్నం చేశారు. పార్లమెంటులోని భద్రతను ఛేదించే విషయమై నిందితులు సిగ్నల్స్ యాప్ ద్వారానూ సంభాషించుకున్నారు. గత ఏడాది మైసూరులో భేటీ అయ్యారు. నిందితుల ప్రయాణ ఖర్చులను మైసూరుకు చెందిన మనోరంజన్ భరించారు.” అని పోలీసులు తెలిపారు.