48 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. బుధవారం రోజున జరిగిన ఈ ఎన్నికల్లో 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు. అలా ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు ప్రధాని మోదీ సహా ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ తరఫున కూడా శుభాభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. “వచ్చే ఐదేళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉంది. సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌ది కీలకపాత్ర. గత ఐదేళ్లు విజయవంతంగా సభ నడిపిన అనుభవం మీకు ఉంది. అదే అనుభవంతో ఈ ఐదేళ్లు ముందుకు సాగుతారని విశ్వసిస్తున్నాను. కొత్త ఎంపీలకు సభాపతి స్ఫూర్తిగా నిలుస్తారు. గతంలో బలరాం ఝక్కడ్ ఐదేళ్ల తర్వాత మరోసారి స్పీకర్ పదవి చేపట్టారు. ఆ తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టే అవకాశం మీకు వచ్చింది. బలరాం జక్కడ్ తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదు. పోటీ నెలకొన్న సందర్భంలో మీరు స్పీకర్ పదవి గెలిచి వచ్చారు. స్పీకర్ పదవి ఎంత కఠినమైనదో మీకు బాగా తెలుసు. చాలా మంది లోక్‌సభ సభ్యులకు మీతో పరిచయం ఉంది.” అని మోదీ అన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలని అన్నారు. సభ సజావుగా నడపడంలో విపక్షం సహకరిస్తుంది స్పీకర్‌కు రాహుల్ హామీ ఇచ్చారు. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.