శుభ‌వార్త : అదిగో రుతు రాగం..

-

ఎండ కాలం మామూలుగా లేదు. వేడి గాలుల చెంత విసిగి  వేసారిపోయిన మ‌నుషుల‌మే మ‌నమంతా ! ప‌ల్లెల‌కూ కాసింత ప‌చ్చ‌ద‌నం లేదు. క‌నుక ఎక్క‌డ చూడండి చ‌ల్ల‌ని నీడ‌లు లేవు. వెచ్చ‌ని గాలులే త‌ప్ప !  కాసింత ఓదార్చే చెట్లు లేవు. మ‌నం చేసుకున్న పాపాల‌కు మ‌రొక‌రిని నిందించ‌లేం. క‌నుక వ‌స్తున్న కాలంలో నైరుతి రుతు ప‌వ‌నాల కాలంలో కాసిన్ని మంచి వాన‌లే వ‌స్తాయి అని అంటున్నారు నిపుణులు. ప‌ర్యావ‌ర‌ణం మ‌న చేయి దాటిపోయాక వ‌స్తున్న ప్ర‌తి సంద‌ర్భంపై  గంపెడాశ‌లు పెట్టుకోవ‌డం త‌ప్ప ఏం చేయ‌గ‌లం? చెట్లు లేవు .. ఉన్న‌వాటిపై ప‌రిర‌క్ష‌ణ చేయాల‌న్న ఆలోచ‌నే లేదు. ప‌ర్యావ‌ర‌ణం అంటూ ప‌రిర‌క్ష‌ణ అంటూ ఏటా వేస‌విలో ఏడ్చి వానా కాలంలో నిట్టూర్చ‌డం మ‌న‌కు తెలిసిన ప‌ని. కానీ మ‌నం చేయాల్సిన ప‌నులు ప్రకృతి హెచ్చ‌రిక‌ల నుంచే అందుతూ ఉన్నాయి.

ఈ ఏడాది కొన్ని వాన‌లు మేలు చేసే వాన‌లు త‌రువాత ప‌రిణామాల కార‌ణంగా ప‌చ్చంద‌నాలను పెంచే క్ర‌మానికి గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ కల్చ‌ర్ లో బ‌తుకీడుస్తున్న మ‌నుషులు, ఇంకా ఇంకొంద‌రు దృష్టి సారిస్తే మేలు. ఆ విధంగా అయినా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెంచితే చాలు.

ఆ విధంగా కాలం వ‌చ్చి కొంత స‌ఖ్య‌త‌ను పెంచాలి. గాలుల మ‌ధ్య నేల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను పెంచాలి. వ‌స్తున్న కాలంలో వానలుండాలి. ఎండ‌ల నుంచి మిన‌హాయింపు కోరుకుంటూ సాగే జీవితాన వ‌స్తున్న వాన‌లు నేల‌కు పుల‌క‌రింత‌లు తేవాలి. హాయిగా ఈ ఏడాది రుతు ప‌వ‌నాలు న‌డ‌వడి బాగుంటే, విపత్తులు లేని సంద‌ర్భాలుంటే మంచి పంట‌లు పండుతాయి. సాగు ప్ర‌క్రియ ముందుకు వెళ్లి మంచి ఫ‌లితాలు అందుకుంటుంది. మంచి వాన‌లు, మంచి పంట‌లు కోరుకుంటున్న మ‌నంద‌రికీ ఈ ఏడాది మంచే జ‌ర‌గాల‌ని ఆశిద్దాం.

కాలం కాని కాలంలో వాన‌లు, మోతాదుకు మించిన వాన‌లు, అటుపై ఎండ‌లు ఇలాంటి మిశ్ర‌మ వాతావ‌ర‌ణంలో ఈ ఏడు వేస‌వి గ‌డిచిపోయింది. ఇంకొంత మిగిలి ఉంది. అది కూడా మ‌రో వారంలో ముగియ‌నుంది. ముగిసే కాలం గురించి చ‌ర్చ క‌న్నా వ‌చ్చే కాలంపై ఆశ‌లే ఇప్పుడిక ఎక్కువ‌గా ఉన్నాయి.ఈ ఏడాది స‌కాలంలోనే నైరుతి రుతు ప‌వ‌నాల ఆగ‌మ‌నం ఉంటుంద‌న్న వార్త‌లున్నాయి. ఇంకా చెప్పాలంటే అనుకున్న స‌మ‌యాని క‌న్నా ముందే రుతు ప‌వ‌నాలు ఆంధ్రా వాకిట‌కు అంతకుముందు కేర‌ళ తీరానికి చేర‌నున్నాయి. రైతుల‌కిది శుభ‌వార్త. ఇవాళే కేరళ తీరాన్ని రుతు ప‌వనాలు తాక‌నున్నాయి అన్న స్ప‌ష్ట‌మైన అంచనాలున్నాయి. న‌ల్ల‌ని మేఘాలు, చ‌ల్ల‌ని గాలులు వేస‌వి తాపం నుంచి తీసుకువ‌చ్చే ఉప‌శ‌మ‌నాలు ఇవి. కనుక వ‌స్తున్న వాన‌కు వెల్కం చెబుదాం.

Read more RELATED
Recommended to you

Latest news