అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువాహటిలోని జలక్‌బారీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని గువాటిలో జలక్‌బారీ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతులంతా ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారంతా అసోం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపారా లేక నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మృతితో ఆ కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ పిల్లల మరణవార్త విని వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.