రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సేఫ్ గా తీసుకువచ్చేలా .. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల ఓ న్యాయవాది సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తాజాగా ఈరోజు విచారణలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు తీసుకుంటున్న చర్యలు, తల్లిదండ్రుల కోసం హెల్ప్‌లైన్ అవకాశం తదితరాల గురించి కేంద్రం నుంచి సూచనలు తీసుకోవాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది.
ఉక్రెయిన్ సరిహద్దులో చిక్కుకుపోయిన పిటిషన్ దాఖలు చేసిన
విద్యార్థితో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారని…ప్రస్తుతం ఆ విద్యార్థి రొమేనియాకు చేరుకున్నారని.. ప్రత్యేక విమానంలో ఈరోజు రాత్రికి ఇతర విద్యార్థులతో కలిపి భారత్‌కు తీసుకువస్తారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ప్రతీ విద్యార్థిని, భారతీయుడిని స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.
ఈ సమయంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యాలు చేసింది. ‘‘గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోక ఇంకా యుద్ధానికి దిగడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. మాకు పెద్దగా చెప్పనక్కర్లేదు కానీ విద్యార్థుల పట్ల ఆందోళన నెలకొంది.’’ అంటూ వ్యాఖ్యానించింది.