గత కొద్ది రోజుల నుంచి దేశంలో స్వలింగ సంపర్క జంటల వివాహాలపై పెను దుమారం రేగుతోంది. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని స్వలింగ సంపర్కులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాదనలు జరిగాయి. తాజాగా స్వలింగ జంటల సమస్యలు పరిష్కారించాలన్న సుప్రీంకోర్టు సూచనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.
LGBTQల సమస్యల పరిష్కారానికి పాలనాపరమైన చర్యలను అన్వేషించేందుకు కేబినేట్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకు కేంద్రం తెలిపింది. అయితే వివాహ చట్టబద్ధత అంశం లేకుండా కమిటీ ఏర్పాటు జరుగుతుందని నివేదించింది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. LGBTQల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ధర్మాసనానికి తెలిపారు. ఇది ఒక మంత్రిత్వశాఖ పరిధిలోని అంశం కాదని.. చాలా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో జరగాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఏమేం చేయాలో LGBTQలు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని మెహతా కేంద్రం తరపున వివరించారు.