కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు కాయగూరలు కొనాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా టమాట, మిర్చి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు వందల రూపాయలతో మార్కెట్ కు వెళ్తే.. ఒక్క కూరగాయతో తిరిగిరావాల్సిన పరిస్థితి. చాలా చోట్ల కూరగాయల ధరలు చూసి సామాన్యులు ఖాళీ సంచులతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు.
ముఖ్యంగా టమాట ధర రికార్డు స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.58 నుంచి రూ.148 పలుకుతుంది. అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని పురులియా ప్రాంతంలో మాత్రం అత్యధికంగా రూ.155కు చేరింది. ఎడల తీవ్రత పెరగడం, రూతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
కాగా, ముంబయిలో అతితక్కువగా కిలో రూ.58 పలుకుతుండగా, దిల్లీలో రూ.110, చెన్నైలో రూ.117, కోల్‌కతాలో రూ.148కి చేరిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.83.29కు లభిస్తుందని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతుందని చెప్పింది. ప్రస్తుత సీజన్ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది.