తాజ్‌మహల్ వద్ద వాటర్ బాటిళ్ల నిషేధంపై వివాదం చెలరేగుతోంది. తాజ్మహల్లోని ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లు తీసుకెళ్లొద్దని.. ఎవరైనా పర్యాటకులకు తాగునీరు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలోనే ఉండే చమేలీ ఫ్లోర్‌లోకి వచ్చి నీటిని తాగొచ్చని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్‌ఐ అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో అనుమతిస్తామని.. కానీ ప్రస్తుతానికి మాత్రం వాటిర్ బాటిల్స్ బ్యాన్ చేసినట్లు చెప్పారు.
తాజ్ మహల్ అసలు పేరు తేజోమహాలయమని, అది శివుడికి నెలవు అని వాదిస్తున్న అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు ఈనెల 3వ తేదీన తాజ్మహల్లోని ప్రధాన సమాధిపై గంగాజలం పోశారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిల్స్ నిషేధించినట్లు తెలిసింది. అయితే శ్రావణ మాసం వేళ తాజ్‌మహల్‌లో జలాభిషేకం, క్షీరాభిషేకం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ యోగి యూత్ బ్రిగేడ్ స్థానిక కోర్టులో పిటిషన్ వేసింది. తాజ్ మహల్ ప్రాచీన శివాలయమని పిటిషన్లో పేర్కొంది. ఈ వ్యాజ్యంపై ఆగస్టు 13న విచారణ జరగనుంది.