బీజేపీ సీనియర్ నాయకుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు కొద్దిసేపు మీడియాలో వినిపించింది. కొన్ని మీడియాలు అత్యుత్సాహంతో గ్రాఫిక్ ప్లేట్లు కూడా డిజైన్ చేసి ఆయనే మన కొత్త రాష్ట్రపతి అని చెప్పేశాయి. కానీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అవన్నీ ఒట్టిదే అని తేలిపోయింది. నిన్న రాత్రి ఈ సమావేశం ఏడు గంటల 30 నిమిషాల నుంచి తొమ్మిది గంటల 15 నిమిషాల వరకూ సాగింది. అటుపై ఎన్డీఏ తరఫున బరిలో నిలిచే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ఏంటి అన్నది బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. దీంతో దేశం యావత్తూ ద్రౌపదీ ముర్మూ పేరు మార్మోగిపోయింది. దీంతో వెంకయ్య అనుకూల మీడియా, అనుకూల రాజకీయ పార్టీలు నిరాశలోనే ఉండిపోయాయి.
మొదట్నుంచి ఉప రాష్ట్రపతిని రాష్ట్రపతిని చేయాలన్న సంప్రదాయం ఉన్నా కూడా బీజేపీ ఎందుకనో దానిని పక్కనపెడుతూ వస్తోంది. ఆ కోవలో ఆ తోవలో క్రితం సారి కూడా ఇలానే చేసింది. 2015 ఆగస్టు 16 నుంచి బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ గొయాంకా ను తీసుకువచ్చి రాష్ట్రపతిని చేసింది. ఈ సారి కూడా అదేవిధంగా కొత్త పేరును ప్రముఖంగా తెరపైకి తెచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలుగు రాష్ట్రాలలో వెంకయ్య అనుకూల వర్గాలు మాత్రం చాలా వరకూ ప్రయత్నించాయి కూడా ! ఆయనకే రాష్ట్రపతి ఇవ్వాలని టీడీపీ నాయకులు కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. కానీ బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచన ఇందుకు భిన్నంగా ఉండడంతో ఆయన కలలు, ఆయన వర్గం కలలు నిజం కాలేకపోయాయి. అయితే ఆయన్ను ఉపరాష్ట్రపతిగా కొనసాగిస్తారు అన్న వాదన కూడా లేకపోలేదు. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్నవారే రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు కనుక బీజేపీ ఆయన్ను ఆ పదవిలో కొనసాగించేందుకు ఇష్టపడుతోంది అని తెలుస్తోంది.