మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిన్నారి ఇందు మృతి కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పటివరకు అసలు మిస్టరీ వీడలేదు. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 టీమ్స్ ను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. కేసు విచారణలో భాగంగా తల్లిదండ్రుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కేసును విచారిస్తున్నారు. మరోవైపు జవహర్ నగర్ స్మశాన వాటికలో ఇవాళ చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈరోజు కూడా నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో గురువారం అదృశ్యమైన పదేండ్ల పాప.. శుక్రవారం చెరువులో శవమై తేలింది. చిన్నారి డెడ్ బాడీని చెరువులో నుంచి బయటకు తీసిన పోలీసులు.. కనీసం తల్లిదండ్రులకు కూడా చూపించకుండా హడావుడిగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో అటు చెరువు వద్ద, ఇటు గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.