ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో కొత్త కేబినెట్ తర్వాత ఈ విభేదాలు ఇంకా భగ్గుమన్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తే.. కాకాణి – అనిల్ కుమార్ యాదవ్ పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభల తర్వాత కూడా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొందని వార్తలు వచ్చాయి.
వీరి పంచాయతీ సీఎం వైఎస్ జగన్ వరకు వచ్చింది. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఎలాంటి గొడవలు లేవని ప్రకటించారు. లేని విభేదాలను ఉన్నట్టు మీడియా సృష్టిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తో కూడా నెల్లూర్ జిల్లా బాధ్యతల గురించి మాత్రమే చర్చించినట్టు వెల్లడించారు. వైసీపీ నేతలు అందరూ ఒకే తాటి పై ఉన్నారని ప్రకటించారు.