కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌కు ఆదేశించిన విషయం విదితమే. అయితే మర్కజ్ ఘటనకు ముందు అంతా సజావుగానే ఉందనుకున్నారు. ఏప్రిల్ 15న లాక్‌డౌన్ ఎత్తివేస్తారని కూడా భావించారు. కానీ మర్కజ్ ఘటన అనంతరం లాక్‌డౌన్ ఎత్తివేతపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మర్కజ్ ఘటన వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల సీఎంలు తలలు పట్టుకున్నట్లు తెలిసింది. మర్కజ్ ఘటనకు ముందు అంతా సజావుగానే ఉందని సంతృప్తి చెందినా.. ఇప్పుడు పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారడంతో.. ఏప్రిల్ 15న లాక్‌డౌన్ ఎత్తివేత లేనట్లేనని తెలుస్తోంది.
కరోనా లాక్‌డౌన్, మర్కజ్ ఘటన నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో మోదీ.. ఏప్రిల్ 15న లాక్‌డౌన్ ఎత్తివేద్దామా..? ఎత్తివేస్తే.. ఎలాంటి ఎగ్జిట్ స్ట్రాటజీతో ముందుకు సాగాలి..? లాక్‌డౌన్ పూర్తయ్యే సరికి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందా.. లేదా..? అని.. అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ చర్చించినట్లు తెలిసింది. ఇక కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడం.. కరోనా రోగులకు, వారికి చికిత్స అందించే వైద్య సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం.. ప్రజలకు కావల్సిన నిత్యావసరాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం.. కరోనా పరీక్షలు చేసేందుకు అవసరం అన్ని రకాల వైద్య పరికరాలు, కరోనా రోగులకు చికిత్స అందించేందుకు కావల్సిన సామగ్రి, మెడిసిన్‌ను.. ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని కూడా మోదీ.. సీఎంలకు చెప్పినట్లు తెలిసింది.
అయితే ఏప్రిల్ 15వ తేదీన ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా కూడా.. జనాలను ఒక్కసారిగా రోడ్ల మీదకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మోదీ సీఎంలకు చెప్పినట్లు తెలిసింది. అయితే అప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుతుందా.. లేదా.. అన్నది సందేహంగా మారింది. మరి ఈ విషయంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..!