కరోనా దెబ్బకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా టీసీఎస్‌లో శాశ్వత రిమోట్ వర్కింగ్ పద్ధతికి కంపెనీ తెరదించింది. ఉద్యోగులందరూ విధిగా కార్యాలయాలకు రావాలని ఐటీ దిగ్గజం సిబ్బందిని కోరింది. ఇప్పటివరకూ నూరు శాతం ఇంటి నుంచి పనిచేసిన వారంతా తమ రోల్స్‌కు అనుగుణంగా తిరిగి ఆఫీసులకు రావాలని టీసీఎస్ కోరింది. ఉద్యోగులందరికీ నూరు శాతం ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉండదని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది.
తమ డెస్క్‌ల్లో తిరిగి పనిచేయాలని పెద్దసంఖ్యలో టీసీఎస్ ఉద్యోగులు భావిస్తున్నందున నూరు శాతం వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌కు ముగింపు పలికామని కంపెనీ ఓ వార్తాసంస్ధతో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నదున ముందుజాగ్రత్త చర్యలు చేపడతామని, ఆఫీసులకు కచ్చితంగా రావాల్సిందేనని మాత్రం పట్టుబట్టబోమని తెలిపింది. ఈ విషయంలో తాము ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామని, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను దీటుగా మలిచేందుకు ప్రయ్నతిస్తున్నామని పేర్కొంది. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి ఇక్కడి వాతావరణాన్ని అనుభవించేలా చూస్తామని నూరు శాతం ఇంటి నుంచే పనిచేసే పద్ధతి మాత్రం ఇక కొనసాగదని టీసీఎస్ సీఓఓ ఎన్. గణపతి సుబ్రమణియమ్ తెలిపారు.