అమరావతి : త్వరలో 1184 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని… ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలని ప్రభుత్వానికి పంపామని ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబా అన్నారు. ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ మార్పులు చేయాలని… గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్ల ఇంటర్వ్యూలు నిర్వహించామని.. 32 లో గ్రూప్ వన్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు అని తెలిపారు.
ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవోలు 39, 150లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని.. గ్రూప్ వన్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-1లో ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నామని… ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ అమలు చేస్తుందని తెలిపారు.