TRS రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఉద్యమ కారులకు స్థానం లేదనేది స్పష్టమవుతుందని.. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వాళ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారని.. చెల్లి కోసమే జగన్ తెలంగాణ వారికి రాజ్యసభ సీట్లు కేటాయించారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ.. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడమెంటని ప్రశ్నించారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని చదవాలని చురకలు అంటించారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడాన్ని కేసీఆర్ తప్పు పట్టడం అంటే.. రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని.. కల్వకుంట్ల రాజ్యాంగం లో అలా లేదేమో…అంటూ ఎద్దేవా చేశారు.
గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళిక సంఘం ద్వారా విడుదల చేసిన నిధులు సున్నా అని ఫైర్ అయ్యారు.చిల్లర రాజకీయాలు చేస్తోంది కేసీఆర్ అని.. పంచాయతీ రాజ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది ఆయనేనని విమర్శించారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్.