సాధికారతతో కూడిన స్ఫూర్తివంతమైన ఒడిశాను తయారుచేయడమే నా జీవిత లక్ష్యమని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఏకైక రాష్ట్రం తమదేనని అన్నారు. వ్యవసాయదారులను రాష్ట్రానికి వెన్నెముకగా అభివర్ణిస్తూ.. వారి కష్టానికి ఫలితంగా నాలుగుసార్లు కృషి కర్మణ్ అవార్డులు లభించాయని గుర్తుచేశారు.
విలక్షణ, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా పట్నాయక్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ ‘జీవన సాఫల్య పురస్కారం’ దక్కింది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ చేతుల మీదుగా ఆదివారం ఈ అవార్డును అందుకున్నారు. గత 22 ఏళ్లుగా తనను ఆశీర్వదిస్తున్న 4.5 కోట్ల మంది ఒడిశావాసులకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ‘ఇప్పుడు మేం సరైన దారిలోనే పయనిస్తున్నాం. జగన్నాథుని దయ, ప్రజల మద్దతుతో త్వరలో అక్కడికి చేరుకుంటాం’ అని సీఎం పట్నాయక్ ట్వీట్ చేశారు.
‘ఒకప్పుడు ఒడిశా పేదరికానికి చిరునామాగా నిలిచేది. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా పేదరికం తగ్గుముఖం పట్టిన రాష్ట్రంగా పేరుపొందింది. రాష్ట్ర పాలనావ్యవస్థ.. మహిళలు, గిరిజన వర్గాల అభివృద్ధిపై ఆధారపడి ఉంది. అటవీ నిర్వాసితులకు భూమి హక్కులు కల్పించడంలో ఒడిశా దేశంలోనే అగ్రగామిగా ఉంది. దీంతోపాటు అత్యధికంగా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తి చేస్తోంది. తయారీ రంగంలో దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మా రాష్ట్రం ఇప్పటికే ఒకసారి హాకీ ప్రపంచ కప్‌నకు వేదికగా నిలవగా.. వరుసగా రెండోసారి 2023లో ఆతిథ్యం ఇవ్వనుంది’ అని నవీన్ పట్నాయక్ వివరించారు.