ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న మాటకు ఎన్నో కొనసాగింపులు ఉన్నాయి. ఎన్నో అర్థ పరమార్థాలు ఉన్నాయి. సాధించాల్సినంత చెప్పాల్సినంత వినాల్సినంత రాజకీయాలలో ఎప్పటికప్పుడు సాధ్యం కావొచ్చు అదే సమయంలో కాకపోనూ వచ్చు. ఆ విధంగా కొత్త కొత్త రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇవాళ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి హల్చల్ చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అభిమతం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అన్నది షురూ అయితే అప్పటిదాకా అక్కడ ఉన్న నాయకులు అంగీకరిస్తారా ? లేదా వ్యతిరేకించి సోనియాపై తిరుగుబాటు చేస్తారా? కేంద్రంలో కేసీఆర్ ను కీలకం చేస్తే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునుపటి లేదా పూర్వ ప్రాభవాన్ని అందుకోవడం ఖాయమేనా !
ఇవే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను వేధిస్తున్న సిసలు సందేహాలు. కొసరు అనుమానాలు కూడా ! ఇవన్నీ ఖాయం అయితే ఇప్పటిదాకా యువ రాజు కేటీఆర్ ను నానా మాటలూ అన్న, అదేవిధంగా పెద్దాయన కేసీఆర్ ను ఉద్దేశించి అనకూడని మాటలు అన్న
రేవంత్ రెడ్డి ఏమయిపోతాడో ? పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పి క్షేత్ర స్థాయిలో కేటీఆర్ తో కలిసి పనిచేస్తాడా లేదా ఎందుకు వచ్చిన తలనొప్పి అని అనుకుని తనకు ఎంతో ఇష్టమయిన తనకు రాజకీయ జీవితాన్ని, పదవులనూ ప్రసాదించిన తెలుగు దేశం పార్టీ వెళ్లనున్నారా ?
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల వ్యూహకర్త హోదాలో పనిచేసేందుకు ప్రముఖ బీహారీ ప్రశాంత్ కిశోర్ సిద్ధం అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన దక్షిణాది రాజకీయాలపై కన్నేశారని తెలుస్తోంది. ఇక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పొత్తుకు సిద్ధం అయితే మేలైన ఫలితాలు వస్తాయన్న అంచనాలో ఆయన ఉన్నారు. ఆ విధంగా ఆయన కొన్ని వ్యూహాలు కొన్ని స్లైడ్లు సిద్ధం చేశారు. ప్రశాంత్ కిశోర్ ముందుగా సిద్ధం చేసుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో వ్యూహాలు అమలు కానున్నాయి. ఆ విధంగా వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే వీటిని కాదనేందుకు గుడివాడ అమర్నాథ్ అనే మంత్రి సిద్ధం అయి ఓ ప్రకటన చేశారు.
వీటిని తోసిపుచ్చుతూ ఒకనాడు కాంగ్రెస్ ను ధిక్కరించి, అధినేత్రి సోనియా నిర్ణయాలపై తిరుగుబాటు చేసి వేరుగా పార్టీ ఏర్పాటు చేసిన నాయకులు జగన్మోహన్ రెడ్డి అని, అలాంటిది తామెందుకు పొత్తుకు సిద్ధం అవుతామని ఎదురు ప్రశ్న వేశారు ఆయన. ఇదంతా బాగుంది కానీ సాయిరెడ్డి మాట ప్రకారం పొత్తు విషయం మంత్రులు కాదు కదా తేల్చాల్సింది పార్టీ అధిష్టానం. సాయిరెడ్డి చెప్పిన ప్రకారం ఇదొక విధాన పర నిర్ణయం. దీనిని అమలు చేయాల్సింది పార్టీ అధిష్టానమే అని అంటున్నారీయన. వేర్వేరు అభిప్రాయలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బతికించేందుకు వైసీపీ సాయం అందిస్తుందా ? లేదా ఎప్పుడూ చెప్పే విధంగా సింహం సింగిల్ గానే వస్తుందా ? ఇదే ఇప్పుడు సంశయం.
ఇక తెలంగాణ మాటకు వస్తే అక్కడ కూడా కొన్ని కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. వాటిని అనుసరించి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని త్వరలో కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు అని తెలుస్తోంది. ఇవాళ ఇదే మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవేళ అదే కనుక నిజం అయితే తెల్లవారితే చాలు కేసీఆర్ నో, కేటీఆర్ నో తిట్టిపోసే రేవంత్ రెడ్డి ఏమౌతారో ?ఇకపై ఆయన పోరాటం ఎవరిపై సాగిస్తారో ? ఆయన మద్దతు ఎవరికి ఉంటుందో ? అన్న అనుమానాలు లేదా సందేహాలు కూడా వెల్లడిలోకి వస్తున్నాయి.