దేశంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ థర్డ్ వేవ్‌కు కారణమయ్యే అవకాశం ఉన్నదని భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వాయిదా పడటానికి అవకాశం ఉన్నది.
వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మణిపూర్ శాసన సభలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో పార్టీలు ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో జనసమీకరణ జరుగుతుండటంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కేసుల విజృంభన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసి, ఎన్నికల ర్యాలీలను నిలిపివేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత ఎన్నికల కమిషన్‌ను అలహాబాద్ హైకోర్టు సూచించింది. ఈ విషయమై చర్చించేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెళ్లారు. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.