దేశంలో కరోనా, ఓమిక్రాన్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓమిక్రాన్ పై రాజకీయాలు చేయడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రపంచంతో పోలిస్తే దేశంలో తక్కువగానే మరణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 3.4 కోట్ల కరోనా కేసుల వస్తే.. కేవలం 4.6 లక్షల మంది మరణించారని మరణాల రేటు కేవలం 1.36 శాతంగానే ఉందని మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు. మనదేశంలో ప్రతీ 10 లక్షల మందిలో 25 వేల కేసులు నమోదైతే కేవలం 340 మంది మాత్రమే మరణిస్తున్నారని వెల్లడించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. దేశంలో మొదటి కేసు జనవరి 13, 2020లో నమోదైతే అంతకుముందే జనవరి 8న నే కేంద్రం జాయింట్ మానిటరింగ్ కమిటీ ఏర్పడిందని అన్నారు. దీన్ని బట్టి తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.