ఇటీవల కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం టికెట్ల ధరలపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఈవోపై బదిలీ వేటు పడింది. అయితే నూతన ఈవో నియామకంపై మరో వివాదం చెలరేగింది. ఆర్జేసీ స్థాయి అధికారులున్నా గెజిటెడ్ సూపరింటెండెంట్ కి అదనపు బాధ్యతలు అప్పగించడం ఏంటని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ డిప్యూటీ కమీషనర్ గా అదనపు బాధ్యతల్లో రాణాప్రతాప్ కొనసాగుతున్నారు. తాజాగా కాణిపాకం ఆలయ ఇన్ చార్జ్ ఇవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ నియామకంపై విమర్శలు వస్తున్నాయి. అంతకుముందు కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ల ధరలు పెంచేశారు. దేవాదాయశాఖకు తెలియకుండా అప్పటి ఈవో సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సీరియస్ అయింది. ఆయనపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. సాధారణంగా అభిషేకం సేవా టికెట్ ధర 750 రూపాయలే. కానీ ఈవో సురేష్ బాబు ఆలయ పాలకమండలితో చెప్పకుండానే ధరను ఏకంగా 5 వేలకు పెంచారు.
అంతేకాదు పెంచిన టికెట్ ధరలపై ఏకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆలయ పాలకమండలికి షాకిచ్చారు. అభిషేకం టికెట్ ధరల పెంపుపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈవో జారీచేసిన నోటిఫికేషన్ రద్దుచేసి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈవో సురేష్ బాబు స్థానంలో పూర్తిస్థాయి ఈవోకి బదులుగా రాణాప్రతాప్ ని నియమించింది ప్రభుత్వం.