తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇకపై తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..విమర్శలు చేసే సీనియర్లకు చెక్ పెడుతూ ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. డిసిసి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లని మార్చే ప్రక్రియ ఆల్రెడీ మొదలుపెట్టారు.
అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టడానికి తానే స్వయంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. పాదయాత్ర చేయాలని మొదట నుంచి అనుకుంటున్నారు. కానీ సీనియర్లు అడ్డుపుల్ల వేస్తున్నారు..పాదయాత్ర అందరూ చేసేలా ప్లాన్ చేయాలని లేదా, బస్సు యాత్ర చేసేలా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అంటే పాదయాత్ర చేస్తే రేవంత్ ఒక్కరిదే ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి చెబుతూ వచ్చారు.
కానీ ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన రేవంత్..సైలెంట్ గా పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తాను కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నానని రేవంత్ చెప్పడంతో రాహుల్ అంగీకరించారని తెలుస్తోంది.
డిసెంబర్ 9న పాదయాత్ర మొదలవుతుందని అంటున్నారు..దీని కోసం రేవంత్ వర్గం ఆల్రెడీ రూట్ మ్యాప్ రెడీ చేస్తుందట. అయితే రేవంత్‌కు పోటీగా భట్టి విక్రమార్క సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడానికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేసుకుని అధిష్టానానికి సమాచారమిచ్చారని తెలిసింది.
అయితే భట్టి యాత్ర చేస్తే ఇతర పనులు రేవంత్ చూసుకోవాలని కొందరు, లేదు లేదు రేవంత్ పాదయాత్ర చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని మరికొందరు మాట్లాడుతున్నారు. అసలు ఇద్దరు కలిసి పాదయాత్ర చేయాలని, లేదా కాంగ్రెస్ నేతలంతా కలిసి బస్సు యాత్ర చేయాలని సీనియర్లు సూచిస్తున్నారట. ఇలా పాదయాత్రకు సంబంధించి కూడా కాంగ్రెస్ లో రచ్చ నడుస్తోంది. మరి చివరికి ఎవరు పాదయాత్ర చేస్తారో చూడాలి.