ధాన్యం కొనుగోలు అంశం రగులుతూనే ఉంది. తెలంగాణలో ప్రతిపక్ష, పాలక పక్షాల మధ్య వరి మంటలు పుట్టిస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్లగొండ, వరంగల్ యాత్రలు రసాభాసాగా మారాయి. ఇది కాస్త బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఓ చిన్న పాటి యుద్ధంగా సాగింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా వరిధాన్యంపై పోరుకు సిద్ధం అయింది. ఇన్ని రోజులు బీజేపీని ఎదుర్కున్న టీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.
తాజాగా ఈరోజు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్న డిమాండ్‌తో గురువారం ఇక్కడి పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనను నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్ వరకు ప్రదర్శన అనంతరం రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలంటూ వినతిపత్రం సమర్పించనున్నారు.