పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జరనల్ పర్వేజ్ ముషార్రఫ్ ఆరోగ్యం విషమించింది. అయితే ఆయన ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన ఆయన 2001 పాక్ అధ్యక్ష పదవిని లాగేసుకున్నారు. 2008 వరకు ఆయన పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలోనే జన్మించిన ముషార్రఫ్ దేశ విభజన సమయంలో తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ సైన్యంలో చేరిన ముషార్రఫ్ సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 1998 నుంచి 2007 దాకా పాక్ ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన ముషార్రఫ్.. 1999 నుంచి 2002 దాకా పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇటు పాక్ ఆర్మీ చీఫ్ పదవితో పాటు ఆ దేశ రక్షణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ముషార్రఫ్ అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. ఇదిలా ఉంటే… శుక్రవారం మధ్యాహ్నం ముషార్రఫ్ చనిపోయారంటూ వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన వక్త్ న్యూస్ అనే మీడియా సంస్థ ముషార్రఫ్ చనిపోయారంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అయితే ఈ వార్తలు అబద్ధమంటూ ఇతర మీడియా సంస్థలు వెల్లడించగా… వక్త్ న్యూస్ సదరు ట్వీట్‌ను డిలీట్ చేసింది.