పాల్వంచలో వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపుతోంది. రామకృష్ణ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో ద్వారా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉంటే పోలీసులు వనమా రాఘవేంద్ర కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు వనమా రాఘవేంద్ర పోలీసులకు పట్టుబడలేదు.
ఇదిలా ఉంటే పోలీసులు వనమా రాఘవేంద్రకు హెచ్చరికలు జారీ చేశారు. 2001లో నమోదైన ఓ కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని పాల్వంచలోని అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఈరోజు మధ్యహ్నం వరకు డెడ్ లైన్ విధించారు. మధ్యాహ్నం 12.30 గంటలలోగా మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే నిన్ననే రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. పోలీసులు దీన్ని తోసిపుచ్చారు. రాఘవ ఇంకా దొరకలేదని.. అతని కోసం ప్రత్యేక టీములతో గాలిస్తున్నామని వెల్లడించారు. అయితే రామకృష్ణ కుటుంబం వనమా రాఘవేంద్ర వేధింపులతో మరణించడంతో ఆయన తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈరోజు పాల్వంచ, కొత్తగూడెం బంద్ కు కూడా పిలుపునిచ్చాయి.