రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది. తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభ లో టిడిపి నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్ హాజరు కాగా వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయు రెడ్డి హాజరు అయ్యారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరు అయ్యారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల అభిప్రాయాన్ని తీసుకునేందుకు, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. “వ్యవసాయ చట్టాల రద్దు” బిల్లు తొలిరోజే సభ ముందుకు రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, “కనీస మద్దతు ధర”ల పెంపుపై చట్టపరమైన భరోసా కోసం రైతుల డిమాండ్ ల పై సమావేశంలో చర్చ జరుగుతోంది. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును మొదటి రోజు (సోమవారం)
లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రేపు (సోమవారం) ఎమ్.పి లు పార్లమెంటు కు తప్పనిసరిగా హాజరుకావాలని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు విప్‌లు జారీ చేశాయి.