విశాఖ ఉక్క ప్లాంట్ ప్రయివేటీకరణ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని అన్నారు. కానీ వైసీపీ పై, ముఖ్య మంత్రి జగన్ పై అనేక ఆరోపణలు చేస్తారని విమర్శించారు. ఇలాగే కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఎలాంటి విమర్శలు చేయరని అన్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రయివేటుపరం చేస్తుంది.. వైసీపీ ప్రభుత్వం కాదని.. కేంద్ర ప్రభుత్వమే అని మంత్రి కొడాలి నాని అన్నారు.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ను అపాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై పోరాటం చేయాలని, వారి పై విమర్శలు చేయాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఆర్బీకే సెంటర్ల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రంగు మారిన వరి ధాన్యాన్ని కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాగే రంగు మారిన ధాన్యానికి సరైన ధరనే చెల్లిస్తామని ప్రకటించారు.