ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాకుండా సమగ్రంగా చూడాలని చెప్పారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని చెప్పారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పవన్ అన్నారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు నీళ్లు ఇవ్వడానికి ఒక బ్రిటీష్ మహిళ నిరాకరించిందని అన్నారు పవన్.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకూడదని పవన్ చెప్పారు. బయట ఉండే శత్రువుల కంటే… మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువని చెప్పారు. ఏపీలో ఎస్పీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెపుతుంటే బాధేస్తోందని అన్నారు. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లను ఖర్చు చేసిందని… వైసీపీ రంగుల కోనం రూ. 21,500 కోట్లను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. నిధులను దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్యబట్టారు.