గత రెండు రోజుల నుంచి ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. విశాఖగర్జన తరువాత విశాఖలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే.. ఎట్టకేలకు.. విశాఖ నుంచి తీవ్ర పరిణామల నేపథ్యంలో మంగళగిరి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే తాము జనవాణి ప్రకటించామని అధికార పక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఒకరికి అడ్డం వెళ్లాలని తామెప్పుడూ ఆలోచించమని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ గర్జన కార్యక్రమం చేస్తామని వైసీపీ వాళ్లు ప్రకటన చేయడానికి మూడ్రోజుల ముందే తాను వైజాగ్ కు విమాన టికెట్లు బుక్ చేసుకున్నానని, ఇంతకుమించి ఆధారాలు ఇంకేం కావాలని పవన్ కల్యాణ్ తెలిపారు పవన్ కల్యాణ్. “అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదు, మూడు రాజధానులపై ఎవరూ నోరెత్తకూడదని వాళ్లు భావిస్తున్నారు.
మాది ఓ రాజకీయ పార్టీ. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడి మీరే దిగజారిపోయారు. మొదటి నుంచి కూడా కుల గొడవలతోటి రాష్ట్రం నిస్సారమైపోయింది. మళ్లీ దాంట్లో మూడు ప్రాంతాలు… ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. ఓసారి తమిళనాడు వాళ్లు తరిమేశారు, మరోసారి తెలంగాణ రాజకీయ నేతలు తరిమేశారు… అయినాగానీ మన రాజకీయ వ్యవస్థకు సిగ్గులేకపోతే ఎట్లా? ఇప్పుడు బయటివాళ్లు ఎవరూ తరిమేయకపోయినా, మనవాళ్లను మనమే తరిమేసేలా పరిస్థితులు సృష్టిస్తున్నారు అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.