మరి నిజంగానే పర్యావరణాన్ని బాగుచేయాలని ఆలోచన లేక..ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలనే లక్ష్యమో తెలియదు గాని…మొత్తానికి ఏపీ సీఎం జగన్…ప్లాస్టిక్ ఫ్లెక్సీలని బ్యాన్ చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడకంపై నిషేధం విధించారు. ఇది చాలా మంచి విషయం…పర్యావరణానికి హాని చేసే వాటిని నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సి ఉంది.
సరే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధించారు..ఇది మంచి విషయమే…కానీ ఇది ఆచరణలో ఎంత వరకు సాధ్యం..ఫ్లెక్సీలపై ఆధారపడి అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. వారి పరిస్తితి ఏంటి…అలాగే ఈ ఫ్లెక్సీలు వాడేదే రాజకీయ పార్టీలు చిన్న స్థాయి నేత దగ్గర నుంచి సీఎం వరకు ఫ్లెక్సీలు ఉంటాయి. ఏదైనా ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి…ఆఖరికి సర్పంచ్ వచ్చిన సరే ఫ్లెక్సీలు కట్టాల్సిందే. ఇక జగన్ సభకు వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఫ్లెక్సీలు కడతారో చెప్పాల్సిన పని లేదు.
అటు టీడీపీ కూడా చంద్రబాబు కోసం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడతారు..అటు జనసేన పవన్ కోసం…ఇలా ప్రతి పార్టీ ఫ్లెక్సీలని కడతాయి. అలాగే ఏదైనా సినిమా రిలీజ్ అయినా, హీరోల పుట్టిన రోజులైనా…అసలు ఏ కార్యక్రమం జరిగిన ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఫ్లెక్సీలు బ్యాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
అదే సమయంలో సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు ఉంది కాబట్టే..జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, అప్పటివరకూ బ్యాన్ అని హడావిడి చేస్తారని, తర్వాత పట్టించుకోరు అని జనసైనికులు అంటున్నారు. అదే సమయంలో పవన్ కూడా దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి ఒక్కసారిగా పర్యావరణంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అంటూ పవన్ అనుమానం వ్యక్తం చేశారు.
అలాగే కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలని, వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. అంటే వైసీపీని పవన్ టార్గెట్ చేస్తున్నారని అర్ధమవుతుంది. మరి ఈ ఫ్లెక్సీల బ్యాన్ చివరికి ఎంతవరకు వెళుతుందో చూడాలి.