పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగే ఏన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పొత్తులపై స్పందించారు. ఏపీలో పొత్తులపై సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా కలిసేదేమీ లేదని తెలిపారు. ఎన్డీఏ సమావేశంలో ఏపీ ఎన్నికలపై కూడా చర్చకు అవకాశం ఉందని పవన్ తెలిపారు.
మరోవైపు ఏపీ, తెలంగాణలో భవిష్యత్తు, పార్టీ మధ్య ఐక్యత, జనసేన పాత్రపై కూడా ఆ సమావేశంలో చర్చ జరగొచ్చని పేర్కొన్నారు. ఎన్డీఏ పాలసీలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపైనా భాగస్వామ్య పక్షాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి నుంచి ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ ఈ రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారు. చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తోన్నానని, అన్ని అంశాలపైనా మాట్లాడతానని పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ సీనియర్ నేతలు తమను ఆహ్వానించారని పేర్కొన్నారు. ఎన్డీఏ విధానాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోబోతోన్నామని, వాటి కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.