ఇవాళ కొండగట్టులో వారాహికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి వారి ఆలయానికి ఇవాళ ఉదయం చేరుకోనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమం కోసం ఇవాళ ఉదయం సుమారు 9 గంటలకు ఆయన కొండగట్టు క్షేత్రానికి చేరుకుంటారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.