ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మాండూస్ తుఫానుగా బలహీనపడింది. ఇది ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 230 కి.మీ దూరంలో మహాబలిపురంకు 180 కి.మీ, చెన్నైకి 210 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 10కి.మీ వేగంతో ఈ తుఫాన్ కదులుతుంది.
ఈరోజు అర్ధరాత్రి నుండి రేపు తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.