త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని చెప్పారు. గాంధీజీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతున్నదని చెప్పారు. అమృత మహోత్సవాల వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు. అమృత మహోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండటమే మన బలం.
మన ముందు ఉన్న మార్గం కఠినమైనది. మన సామర్థ్యం, ప్రజల చైతన్యం వల్ల ప్రపంచం మనదేశాన్ని చూసే దృష్టి మారింది. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ఫలాలు అందరికీ అందుతున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.