విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ అయిన వారిలో 92 మందిని రూ. 10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. జనసేన వీరమహిళలను సైతం రాత్రి ఒంటి గంట సమయంలో మగ పోలీసులు పట్టుకుని వాహనాల్లోకి ఎక్కించడం గమనార్హం. కాగా, అంతకు ముందు అరెస్ట్ చేసిన నేతలను ఏడో అదనపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారిని కోర్టుకు తరలించే సమయంలో ప్రాంగణంలోని అన్ని గేట్లను మూసివేశారు. మరోవైపు, విశాఖ ఘటనకు సంబంధించి తమ జనసైనికులు 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. వీరిలో 61 మందికి బెయిలు లభించిందని, 9 మందికి కోర్టు రిమాండ్ విధించిందని తెలిపింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జనవాణి కార్యక్రమం కోసం శనివారం సాయంత్రం 4.30గంటలకు విశాఖ వచ్చారు.
ఆయనకు స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేశ్ విశాఖ గర్జన కార్యక్రమం ముగించుకొని విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు లోపలికి వెళుతుండగా… జనసేన కార్యకర్తలున్న వైపు నుంచి స్టీల్ చెత్తకుండీ మూత ఒకటి గాలిలో ఎగురుతూ వచ్చి మంత్రి రోజా వ్యక్తిగత సహాయకుడు దిలీప్‌కు తగింది. ఆయన తలకు గాయమవడంతో జనసైనికుల దాడిగా మంత్రులు ప్రచారం చేశారు. దిలీప్ రాత్రి 10గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు 11గంటల సమయంలో 307సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి జనసేన కీలకనేతలు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, కోన తాతారావు, సుందరపు విజయకుమార్, పంచకర్ల సందీప్, పీవీఎస్‌ఎన్ రాజు, బొడ్డేపల్లి రఘు, పీతల మూర్తి యాదవ్, కొల్లూరి రూప, తోటకూర మంగ, బొగ్గు శ్రీను తదితర వంద మందికిపైగా అరెస్టు చేశారు.