బీఆర్ఎస్‌తో రాజకీయం..చక్రం తిప్పడానికి వెళ్తారా?

-

ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇంకా కనుమరుగు కానుంది. టీఆర్ఎస్ కాస్త…భారత్ రాష్ట్ర సమితిగా మారింది. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ సత్తా చాటాలని ఉద్దేశంతో కేసీఆర్..టీఆర్ఎస్‌ పేరుని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మార్పుని ఎన్నికల సంఘానికి కూడా సూచించారు. దీంతో తాజాగా బీఆర్ఎస్ పార్టీని గుర్తిస్తూ ఎన్నికల సంఘం కేసీఆర్‌కు లేఖ పంపింది.

అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసింది. దీనిపై నేడు కేసీఆర్..ఆవిర్భావ సంబరాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ గా మారడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  శుక్రవారం బీఆర్ఎస్ జెండా ఆవిస్కరించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలందరికి ఆహ్వానాలు అందడంతో ఢిల్లీలోని నేతలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక జాతీయ పార్టీగా మారడంతో ఇకనుంచి కేసీఆర్..కేంద్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళే ఛాన్స్ కనిపించడం లేదు.

ఎందుకంటే ఏడాదిలోనే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి…ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం దక్కించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు..అందుకే తన దృష్టి మొత్తం తెలంగాణపైనే ఉంది..ఇటీవల వరుసపెట్టి జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. పైగా కేంద్రంలో బీజేపీకి ఇంకా ఊపు వచ్చేలా గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడే కేసీఆర్..జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పే ఆలోచన చేయకపోవచ్చు.

ముందు రాష్ట్రంలో సత్తా చాటాక..ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీపై తాజాగా ఓ ట్విస్ట్ వచ్చింది.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదించవద్దంటూ వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రేమ్ నాయక్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో సెప్టెంబర్ 5న ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. కానీ ఆల్రెడీ ఎన్నికల సంఘం ఆమోదించేసింది. మొత్తానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news