ఏపీ సీఎం జ‌గ‌న్‌ పై యాంటీ ప్ర‌చారం వెన‌క‌… ఇది సాధ్య‌మేనా ?

-

ఏపీ సీఎం జ‌గ‌న్‌ పై ఓ వ‌ర్గం మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం సంచ‌ల‌నం రేపుతోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌, ఆయ‌న చేస్తున్న ఖ‌ర్చులు.. సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. వంటివాటిని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప‌రిశీలిస్తోంద‌ని.. తాము ఇస్తున్న డ‌బ్బులు ఏం చేస్తున్నార‌ని.. నిల‌దీస్తోంద‌ని.. ఈ మీడియా రాసుకొచ్చింది. అంతేకాదు.. అప్పులు చేయ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తోంద‌ని.. కూడా పేర్కొంది. ఇక‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కేంద్రంలోని అధికారులు క్లాస్ కూడా పీకుతున్న‌ట్టు తెలిపింది. ఏపీని అప్పుల పాలు చేసి.. ప్ర‌జ‌ల‌ను క‌ట్టుబ‌ట్ట‌ల‌తో న‌డిరోడ్డుపై నిల‌బెడ‌తారా? అంటూ.. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం జ‌గ‌న్‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉంద‌ని ఈ వ‌ర్గం మీడియా పేర్కొంది.

ఏపీ సీఎం జ‌గ‌న్‌

ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిన జ‌గ‌న్‌.. మ‌రో రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నార‌ని.. ఇంత దారుణంగా ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నారా ? అంటూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీపై ఎన‌లేని ఆవేద‌న‌తో కూడిన‌ ప్రేమ ఒల‌క‌బోసిన‌ట్టు ఈ వ‌ర్గం మీడియా పేర్కొంది. రుణ‌ప‌రిమితిని దాటేసి.. జ‌గ‌న్ చేస్తున్న అప్పుల‌పై వివ‌ర‌ణ కూడా కోరిన‌ట్టు తెలిపింది. అయితే.. ఇక్క‌డే చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే.. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేసినా.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన స‌బ్జెక్ట్‌. పైగా రుణ ప‌రిమితికి కొన్ని నిబంధ‌న‌లు కూడా ఉన్నాయి. వాటిని అనుస‌రించే.. అప్పులు చేస్తారు త‌ప్ప‌.. దానిని మించ‌డానికి వీల్లేదు.

అయినా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వమే.. “మేం చెబుతున్న సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తే.. ఎంత అప్ప‌యినా చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తాం“ అని కొన్నాళ్ల కింద‌ట పేర్కొన్న విష‌యాన్ని ఇదే మీడియా వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ స‌హా మ‌మ‌తా బెన‌ర్జీ సీఎంగా ఉన్న బెంగాల్‌, ఒడిశా, త‌మిళ‌నాడు ఇలా..అన్ని రాష్ట్రాలూ అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇక‌, తెలంగాణ‌లోనూ కేసీఆర్ స‌ర్కారు.. అప్పులు చేస్తోంద‌ని.. అక్క‌డి విప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. అంటే.. దీనిని బ‌ట్టి తెలిసేదేంటి? అప్పులు ఏరాష్ట్రానికీ కొత్త కాదు.. ఏపీకి ఇప్పుడు మాత్ర‌మే వ‌చ్చిన ముప్పు అంత‌క‌న్నా కాదు.

గతంలో చంద్ర‌బాబు పాల‌న‌లోనూ అప్పులు చేశారు. అయితే.. ఇప్పుడు జీవ‌న వ్య‌యం.. పెరిగిన నేప‌థ్యంలో దీనికి సంబంధించిన గ‌ణాంకాల ఆధారంగానే కేంద్రం అప్పుల‌కు ప‌చ్చ‌జెండా ఊపుతోంది త‌ప్ప‌.. మ‌రేమీ లేదు. కానీ, జ‌గ‌న్‌పై ఏదోఒక రాయి విస‌రాల‌నే ఉత్సుక‌త‌తోనే ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news