గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం ఎంత పడిందో చెప్పాల్సిన పని లేదు. రెండు జిల్లాల్లో జనసేన పార్టీ భారీగా ఓట్లు చీల్చింది. అయితే గెలిచింది ఒక్క సీటు మాత్రమే..కానీ ఓట్లు చీల్చి టిడిపి ఓటమికి వైసీపీ గెలుపుకు కారణమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉంటే అందులో టిడిపి ఆరు, జనసేన ఒక సీటు గెలిస్తే..వైసీపీ 27 సీట్లు గెలిచింది.
ఒకవేళ టిడిపి-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ 10 సీట్లు లోపే గెలుచుకునేది. అంటే జనసేన ఏ స్థాయిలో ఓట్లు చీల్చి వేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచి మంత్రులైన వారిలో కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఈ ఇద్దరు కేవలం జనసేన ఓట్లు చీల్చడం వల్లే గెలిచారు. అలా గెలిచి మంత్రులుగా ఛాన్స్ కొట్టేశారు. ఇక మంత్రులైన తర్వాత వీరి పని కేవలం పవన్‌ని తిట్టడమే. తాజాగా పవన్ ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తణుకులో తాజాగా వారాహి యాత్ర చేసి..అక్కడ మంత్రి కారుమూరిపై ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని యథావిధిగానే టార్గెట్ చేశారు.
ఇక ఎప్పటిలాగానే కారుమూరి ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు-పవన్‌లని ఎర్రిపప్ప అని తిట్టారు. అటు పక్కనే ఉన్న తాడేపల్లిగూడెం నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం పవన్ పై ఫైర్ అయ్యారు. పవన్ పెయిడ్ ఆర్టిస్టు అని, చంద్రబాబు దగ్గర కిరాయి కోసం పనిచేస్తున్నారని అన్నారు.
అయితే పవన్‌ని తిడుతున్న ఈ ఇద్దరు మంత్రులకు పవన్ తోనే చిక్కులు. పవన్ గాని టిడిపితో కలిస్తే వారిద్దరికి ఓటమి ఖాయం. గత ఎన్నికల్లో కారుమూరి తణుకు నుంచి 2 వేల ఓట్ల టిడిపిపై గెలిచారు. అప్పుడు జనసేనకు 32 వేల ఓట్లు వచ్చాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే కారుమూరి గెలవరు. ఇటు తాడేపల్లిగూడెంలో కొట్టు టిడిపిపై 16 వేల ఓట్లతో గెలిచారు. అక్కడ జనసేనకు 36 వేల ఓట్లు పడ్డాయి. అంటే అక్కడ టిడిపి-జనసేన కలితే కొట్టు గెలుపు కష్టమే.