ఎప్పుడు ఏదొక వివాదంలో ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే..ఆ మధ్య మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు, రాజాసింగ్‌ని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరిగ్గా లేదని కోర్టు..రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చింది. కానీ తర్వాత పాతబస్తీలో ఎంఐఎం శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేయడంతో..రాజాసింగ్‌ని పీడీయాక్ట్ చట్టం కింద అరెస్ట్ చేశారు.
ఇప్పటివరకు ఆయనకు బెయిల్ కూడా రాలేదు. ఇక అంతకముందే బీజేపీ సైతం..రాజాసింగ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజాసింగ్‌కు పూర్తి స్థాయిలో మద్ధతు దక్కలేదు. ఏదో తన నియోజకవర్గంలోని కొందరు కార్యకర్తలు మాత్రం కాస్త రాజాసింగ్ కోసం పోరాటం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఏ బీజేపీ నేత కూడా రాజాసింగ్‌కు మద్ధతుగా మాట్లాడలేదు. ఏ ఒక్కరూ కూడా రాజాసింగ్ గురించి మాట్లాడటం లేదు. దీంతో బీజేపీ..రాజాసింగ్‌ని సైడ్ చేసేస్తుందని కథనాలు వచ్చాయి.
కానీ ఆ కథనాలు నిజం కాదని తెలుస్తోంది…బ్యాగ్రౌండ్‌లో కమలం పార్టీ రాజాసింగ్‌కు సపోర్ట్ గానే ఉందని తెలుస్తోంది. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే అదే నిజమనిస్తుంది. తాజాగా నాల్గవ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సభలో కొందరు బీజేపీ కార్యకర్తలు.. రాజాసింగ్‌ను విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బండి సంజయ్ జోక్యం చేసుకుని.. ఏం చేయాలో తమకు తెలుసని, జరగాల్సింది.. జరిగి తీరుతుందని, తమకు జైలుకు పోవడం కొత్త కాదని, తానూ జైలుకు నమస్కారం పెట్టి వచ్చానని, ధర్మం కోసం జైలుకు పోవడం తప్పు కాదని, దొంగ పనులు చేసే వారే జైలుకు పోవడానికి భయపడతారన్నారు. బండి మాటలు బట్టి చూస్తుంటే..బీజేపీ రాజాసింగ్‌కు మద్ధతుగానే ఉందని అర్ధమవుతుంది. త్వరలోనే రాజాసింగ్ బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.