పాదయాత్రతో తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్…రాజకీయంగా తన టార్గెట్‌ని మర్చినట్లు కనిపించడం లేదు. ఆయన కేసిఆర్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. కేసిఆర్ ఢిల్లీకి వెళ్ళి బిజేపి పెద్దలని వరుసపెట్టి కలుస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో సంజయ్ దూకుడు పెంచారు. అసలు టిఆర్‌ఎస్-బిజేపి ఒక్కటే అని భావన ప్రజల్లో కొంచెం కూడా రాకూడదనే ఉద్దేశంతో బండి ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.
అందుకే పాదయాత్రలో ఆయన…కేసిఆర్‌ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో టిఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎంని కూడా బండి వదలడం లేదు. ఎలాగైనా ఎంఐఎంని దెబ్బకొట్టాలని బండి మొదట నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే మతాలకు సంబంధించిన రాజకీయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తమదే హిందుత్వ పార్టీ అని గట్టిగా చెబుతూనే, వేరే మతాలకు వ్యతిరేకం కాదు అంటూనే, ఎంఐఎంని ఫుల్‌గా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే క్రమంలో బిజేపి అధికారంలోకి వస్తే ఉత్తర్ ప్రదేశ్ మాదిరిగా తొలిసారి జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి, ‘ ఒక్కరు చాలు…ఇద్దరు హద్దు…ముగ్గురు వద్దు’ అనే నినాదాన్ని తీసుకొస్తామని అంటున్నారు. అంటే 2023 ఎన్నికల్లో తెలంగాణలో బిజేపి జెండా ఎగురుతుందని బండి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అలాగే జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఎంఐఎంని టార్గెట్ చేసే బండి ఇలా మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది.
పైగా గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కేసిఆర్ ప్రభుత్వం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని చూశారనే విమర్శలు ఉన్నాయి. అంటే పరోక్షంగా ఎంఐఎంకు లబ్ది చేకూర్చాలని చూశారని బిజేపి ఆరోపిస్తుంది. కానీ తాము అధికారంలోకి వస్తే టిఆర్‌ఎస్, ఎంఐఎంలకు తిప్పలు తప్పవని బండి ఇప్పుడే హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి బిజేపి, తెలంగాణలో అధికారంలోకి రాగలదో లేదో?